రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ నేత ముఖీం సంచలన వ్యాఖ్యలు

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని నిర్మాణాల కూల్చివేత వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. తన ఆస్తులను కూల్చివేయడంపై బీఆర్ఎస్ నేత, న్యాయవాది ఎంఏ ముఖీం తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత స్థాయిలో సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ కక్షతోనే తనను లక్ష్యంగా చేసుకున్నారని, సీఎం తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఆదివారం తన తండ్రి ఎంఏ షరీఫ్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన ముఖీం, సీఎం రేవంత్‌ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "గతంలో మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసిన సమయంలో పాత పరిచయంతో నా ఇంటికి వచ్చి కాళ్లు పట్టుకుని గెలిపించాలని ప్రాధేయపడిన విషయం నిజం కాదా?" అని ఆయన ప్రశ్నించారు. "నా ఇంట్లో భోజనం చేసి, నీళ్లు తాగి నాకే ద్రోహం చేస్తావా" అంటూ తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు.

శనివారం అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్ గ్రామంలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించారన్న ఆరోపణలతో ముఖీంకు చెందిన గెస్ట్‌హౌజ్‌, ఇతర నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఈ చర్యలపై ముఖీం స్పందిస్తూ.. అది తమ తాతముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమి అని, ఏకపక్షంగా కూల్చివేయడం సరికాదన్నారు. ప్రభుత్వం, హైడ్రా ఎన్ని కుట్రలు చేసినా తనకు న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉందని, ఈ చర్యలపై న్యాయపోరాటం చేస్తామని ముఖీం స్పష్టం చేశారు.

Revanth Reddy
MA Mukheem
Sangareddy
Ameenpur
BRS Leader
Telangana Politics
Demolition
Illegal Construction
HYDRA
Land Dispute

More Telugu News